Deepam-2 Subsidy: దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నా, రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం కొత్త విధానం అవలంబించనుంది. ఇక నుంచి సిలిండర్ తీసుకున్న తర్వాతి నెలలో నిర్ణీత తేదీన రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబరు 31న దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఒకటి, ఆగస్టు నుంచి నవంబరు వరకు రెండోది, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో సిలిండర్‌కు రాయితీ విడుదల అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీ సొమ్మును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తోంది. లబ్ధిదారుడు సిలిండర్ బుక్ చేసుకుని సొమ్ము చెల్లించి తీసుకున్న తర్వాతే రాయితీ ఖాతాలో జమ అవుతోంది. ఇది ఎప్పుడు జమ అవుతుందో తెలియక, కొందరికి ఒకటికి మించి ఖాతాలు ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది.

కొత్త విధానంలో సెప్టెంబరులో సిలిండర్ తీసుకున్న అర్హులకు అక్టోబరులో నిర్ణీత తేదీన, అక్టోబరులో తీసుకున్నవారికి నవంబరులో రాయితీ జమ అవుతుంది. ఏ తేదీన విడుదల చేయాలనేది త్వరలో నిర్ణయిస్తారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి నగదు బదిలీ పథకాల తరహాలోనే దీపం రాయితీ కూడా ముందుగానే తేదీ తెలిసేలా చేస్తారు.

రాష్ట్రంలో మొత్తం 1.61 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దీపం-1 కింద 58.42 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో 0.74 లక్షలు, సీఎస్‌ఆర్ కింద 6.24 లక్షలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11.37 లక్షలు, ఇతర కనెక్షన్లు 84.42 లక్షలు ఉన్నాయి. అర్హులకు ప్రభుత్వం ఉచిత సిలిండర్లు అందిస్తోంది. ఒక్కో విడతలో సుమారు 92 లక్షల నుంచి కోటి సిలిండర్లు రాయితీపై ఇస్తున్నారు. ఏడాదికి రూ.2,900 కోట్లు ఖర్చు పెడుతున్నా ఆశించిన మేరకు మైలేజీ రాకపోవడంతో ఈ మార్పు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags: