Minister Nara Lokesh: దేశానికి మోడల్‌గా అమరావతి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ : మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్

Update: 2026-05-11 15:29 GMT

Minister Nara Lokesh: సింగపూర్‌లోని పుంగోల్ తరహాలో అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే ఆదర్శ మోడల్‌గా నిలుస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, JISC మద్దతుతో అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తి ఉన్న భాగస్వాములను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు.

రాజధాని అమరావతికి ఇప్పుడు జాతీయ స్థాయి చట్టబద్ధత లభించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసే అవకాశాలను అన్వేషించాలని కోరారు. సింగపూర్‌లోని సన్‌టెక్ సిటీని అధ్యయనం చేస్తామని ఆయన ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య పటిష్ఠమైన భాగస్వామ్యం ఏర్పడిందని లోకేశ్ వెల్లడించారు. MoUలోని అంశాల అమలు కోసం వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతి నెలా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు మంత్రులు సింగపూర్‌లో వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనా అనుభవాలను పంచుకున్నారని గుర్తు చేశారు.

ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ద్వారా అమరావతి ఆధునిక రాజధానిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News