CM Chandrababu Naidu: అవకాశాల వేదికగా అమరావతి.. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అభివృద్ధి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు

Update: 2026-06-16 11:42 GMT

CM Chandrababu Naidu: సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై సీఎం ప్రసంగించారు.

25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడానని, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌తో తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఏఐ వచ్చిందని వ్యాఖ్యానించారు. పీపుల్ ఫస్ట్ తమ విధానమని, ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మౌలిక వసతులతో అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. కృష్ణానది, ఇన్నర్-ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. స్పోర్ట్స్, ఫైనాన్షియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి కాన్సెప్టులను అమలు చేస్తున్నామన్నారు.

ఒక్క పిలుపుతో రైతులు 35 వేల ఎకరాలు అప్పగించారని, వాటిలో కొంత భాగం అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లుగా తిరిగి ఇస్తున్నట్లు చెప్పారు. 21 కి.మీ పొడవున వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందని వెల్లడించారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే నేడు రూ.200 కోట్లకు పెరిగిందని ఉదాహరణగా చెప్పారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందని సైబరాబాద్ నిదర్శనమన్నారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా చేస్తూ జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను తీసుకువస్తున్నామని, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రత్యేక ఆకర్షణలు సృష్టిస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని సందర్శించి సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అమరావతి విజన్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి, భవిష్యత్తు స్మార్ట్ సిటీగా దాని సామర్థ్యాన్ని సమర్పించారు.

Tags:    

Similar News