Vice President: పెట్టుబడులకు కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది: ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి
Vice President: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతోందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకూ భారీ సంఖ్యలో ప్రాజెక్టులను ఆకర్షించడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. గతేడాది జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 76 శాతం అమల్లోకి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించిన విజయమని కొనియాడారు. మాట్లాడే మాటలు, ప్రణాళికలు ఆచరణాత్మక విజయంగా మారడమే సీఐఐ భాగస్వామ్య సదస్సు అసలైన గొప్పతనమని అన్నారు.
విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకల్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘ తీర ప్రాంతం, మూడు జాతీయ పారిశ్రామిక కారిడార్లు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంతో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక చర్చలకు కీలక కేంద్రంగా విశాఖపట్నం ఎదిగిన తీరును గత రెండు రోజులుగా చూస్తున్నామని అన్నారు. విధాన రూపకర్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు చాలా మందికి అది నచ్చలేదని, కానీ ఒక్కోసారి చెడులోనూ మంచే జరుగుతుందని చెప్పారు. విభజిత రాష్ట్రంలో విజయనగరం నుంచి తిరుపతి వరకూ, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాలతో స్వర్ణాంధ్ర-2047 విజన్ అనుసంధానమై ఉందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, పోర్టులు, ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆవిష్కరణలకు కేంద్రంగా తయారవుతోందని పేర్కొన్నారు.
రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత నిర్ణయాత్మక శక్తి అవుతుందని, డిజిటల్ విప్లవం మరింత వేగవంతమవుతుందని చెప్పారు. అందరికీ ఒక ఏఐ అసిస్టెంట్ ఇవ్వాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, మా ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ఒక ఏఐ అసిస్టెంట్‌ను ఇవ్వాలని కోరుతున్నానని సరదాగా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రస్తుత సదస్సు థీమ్ సందర్భోచితమని అన్నారు. సవాళ్ల నుంచే విజయగాథలు మొదలవుతాయని, మార్పులకు అనుగుణంగా మారడం, ఆవిష్కరణలు, విశ్వసనీయ భాగస్వామ్యాలతో భారత్, ఏపీ భవిష్యత్తును తీర్చిదిద్దే స్థితిలో ఉన్నాయని స్పష్టం చేశారు.