Visakhapatnam Summit: విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అర్థం చెప్పింది. ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపును వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం చేతల్లో చూపించింది. ఇటీవల అనుమతించిన 15 సంస్థల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా విశాఖ సదస్సులో జీవోలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సెయింట్ గొబెయిన్, ఎల్‌అండ్‌టీ, కియా వంటి సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

విదేశీ పెట్టుబడులకు ఏపీ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. కియా సంస్థ తమ ప్లాంటు విస్తరణ కోసం రూ.18,878 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పారిశ్రామిక పెట్టుబడిదారులకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని, ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తామని అన్నారు. దక్షిణ కొరియా కంపెనీలు రాష్ట్రంలో యాంకర్ ఇండస్ట్రీస్ అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు.

ఏపీపై నమ్మకం ఉండి మరోసారి భారీ పెట్టుబడికి కియా ముందుకొచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీలో ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. కియా డిజైన్ ఇంజినీరింగ్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, స్ట్రాటజిక్ బ్యాటరీ పరిశోధన కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఐఐటీ తిరుపతి భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

గతంలో కియాను ఏపీకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించానని, దక్షిణ కొరియాకు వెళ్లి యాజమాన్యాన్ని ఒప్పించానని గుర్తు చేసుకున్నారు. 14 నెలల్లోనే ప్లాంటు ఏర్పాటు పూర్తయిందని, కియా నగరంగా పెనుకొండ మారిందని, 2019లో కార్ల ఉత్పత్తి ప్రారంభించి ప్రస్తుతం వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఏపీలో తయారైన తొలి కారును తానే ప్రారంభించానని స్పష్టం చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల తయారీకి రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏటా 2 లక్షల వాహనాలను తయారు చేయనుంది. 12 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. రెండో తయారీ కేంద్రం, అనుబంధ యూనిట్లకు కలిపి 465 ఎకరాల్లో విస్తరణ ప్రాజెక్టు చేపట్టనుంది. కొత్త ప్లాంట్‌లో ఐసీఈ, ఈవీ వాహనాల అధునాతన మోడళ్లను తయారు చేయనుంది. 2029 ఆఖరుకు పూర్తి చేయాలని ప్రతిపాదించగా, మే నాటికి పూర్తి చేయాలని సీఎం కోరారు. సీఎం సమక్షంలో కియా (ఇండియా) ఎండీ, సీఈవో గ్వాంగూ లీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎయి చుల్ జెంగ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Tags: