CM Chandrababu: పెట్టుబడులకు భరోసా.. స్వీయ ధ్రువీకరణతో అనుమతులు, త్వరలో రక్షణ చట్టం: చంద్రబాబు
చంద్రబాబు
CM Chandrababu: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నమోదు చేసుకుంటే వెంటనే పని ప్రారంభించేలా స్వీయ ధ్రువీకరణ విధానంలో అనుమతులిస్తామని, నెలరోజుల్లో దీన్ని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలకు అనుమతుల్ని సులభతరం చేస్తున్నామని, అధికశాతం పరిశ్రమలకు ‘డీమ్డ్ క్లాజ్’ కింద స్వీయ ధ్రువీకరణతో కొన్ని అనుమతులు ఆటోమేటిక్‌గా ఇస్తామని చెప్పారు. కొన్నింటికి నిపుణుల బృందాల్ని నియమించి వారి బాధ్యతతో అనుమతులిస్తామని, 20% పరిశ్రమలకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితిలోపు రియల్‌టైమ్‌లో అనుమతులు ఇస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమ పెట్టడానికి ఇకపై కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండదని అన్నారు.
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. భాగస్వామ్య సదస్సు, ప్రాంతీయ సమావేశాల ద్వారా రూ.9.89లక్షల కోట్ల పెట్టుబడులకు 303 అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. కియా పెనుకొండలో 2 బిలియన్ డాలర్ల విస్తరణను ప్రతిపాదించిందని, రిలయన్స్ రూ.2.73 లక్షల కోట్ల ఎంవోయూపై సంతకం చేసిందని చెప్పారు. 2024 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడులను పైప్‌లైన్ చేసిందని, ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. తిరుపతిని గ్లోబల్ డిజైన్హబ్గా తీర్చిదిద్దుతున్నామని, మొదటిదశలో 5,000 ఎకరాలు కేటాయిస్తామని అన్నారు.
వచ్చే ఏడాది నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు కుటుంబంతో రావాలని ఆహ్వానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. పెట్టుబడిదారులకు నిర్దిష్ట ప్రయోజనాలకే భూమి ఇస్తున్నామని, ఇతర అవసరాలకు మళ్లిస్తే రద్దుచేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన కంటే 2019-24 మధ్య విధ్వంసమే అధికమని, ఇప్పుడు మొదట్నుంచి పునర్నిర్మిస్తున్నామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి పనిచేయాలనేదే సంకల్పమని పేర్కొన్నారు.
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా విద్య, నైపుణ్యాలు, విలువలతో కూడిన సమగ్ర వికాసానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి యువత, దేశ భవితకు పునాదులని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి కలలను సాకారం చేసేలా ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దడం అందరి బాధ్యతనన్నారు. బాలల అభ్యున్నతితోనే రాష్ట్రం, దేశ ప్రగతి సాధ్యమని ఆకాంక్షించారు. రేపటి గొప్ప భవిష్యత్తుకు చిన్నారులే పునాదులని మంత్రి లోకేశ్ అన్నారు.