Chandrababu Naidu: సింగపూర్ టెక్ అవసరాలు తీర్చడానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామిగా నిలవాలని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ఏపీ అనుకూలతలను వివరించిన సీఎం, ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలు సాధిస్తున్నట్లు తెలిపారు. “రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. ఏపీ రైతులు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తున్నారు. ఉద్యానవన పంటల ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం” అని చంద్రబాబు వివరించారు.
రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్ రంగాల్లో సహకారం కావాలని కోరిన సీఎం, “సింగపూర్ టెక్ అవసరాలు తీర్చడానికి ఏపీ యువత సిద్ధంగా ఉంది” అని పేక్కొట్టారు. పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని, పెట్టుబడుల ద్వారా అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి సాధ్యమవుతుందని అన్నారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఏపీ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు స్పందించిన హైకమిషనర్ శిల్పక్ అంబులే, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ ఎకోసిస్టంలో సింగపూర్ ముందుందని, భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేయడానికి సింగపూర్ ఆసక్తి ఉందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇదే సరైన సమయం
అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉందని, ఏపీలో ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త భూ సమీకరణ విధానం ద్వారా ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తున్నామని, ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ వంటి సంస్థలకు వేగంగా భూములు ఇచ్చామని తెలిపారు.
పౌర సేవలతోపాటు అన్ని రంగాల్లో టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం పేక్కొట్టారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి నారాయణ, పలువురు సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు పాల్గొన్నారు.
ఈ పర్యటన ఏపీలో పెట్టుబడులు, టెక్నాలజీ సహకారం, ఉపాధి అవకాశాలను మరింత వేగవంతం చేసే దిశగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.