AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష: తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్నడూ అడ్డు చెప్పలేదు

తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్నడూ అడ్డు చెప్పలేదు

Update: 2026-01-12 10:51 GMT

AP CM Chandrababu: రాష్ట్ర ప్రజల ఆశలను నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చిందని, విధ్వంసకర వ్యవస్థల నుంచి సుపరిపాలనను సరైన మార్గంలో పెట్టామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా సాధించగలిగామని, ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

సచివాలయంలో మంత్రులు, ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం... జీఎస్‌డీపీ, ఆర్‌టీజీఎస్‌, పట్టాదారు పాస్‌బుక్‌లు వంటి అంశాలపై వివరంగా చర్చించారు.

సంక్షేమ పథకాల సాధనలు

తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా 3.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని, దీనికి ఇప్పటివరకు రూ.1,114 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు అందజేశామని చెప్పారు. ఏడాదిన్నర కాలంలో 50 వేల కోట్ల మేర పింఛన్లు అందించడం ద్వారా సంక్షేమ రంగంలో కొత్త మైలురాయిని సాధించామని ఆయన పేర్కొన్నారు.

అమరావతి, పోలవరం, నల్లమల సాగర్‌పై కీలక వ్యాఖ్యలు

గతంలో అమరావతిని శ్మశానం, ఎడారి అని హేళన చేశారని, కానీ ఇది స్ఫూర్తిదాయక ప్రాజెక్టని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టని, అది పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

నల్లమల సాగర్‌ ద్వారా రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరందుతుందని, ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. ఎగువ నుంచి వదిలిన నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వినియోగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తానెన్నడూ అడ్డు చెప్పలేదని సీఎం గుర్తుచేశారు.

ఇతర అభివృద్ధి అంశాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలోనే దేశానికి అంకితం చేస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర సహకారంతో కాపాడుకున్నామని, అది ఆంధ్రుల సెంటిమెంట్ అని, ప్లాంట్‌ను నిలబెట్టి తీరతామని ఉద్ఘాటించారు.

దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని, రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ డెస్టినేషన్‌గా మారిందని చెప్పారు. ఎస్‌ఐపీబీ ద్వారా రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు వివరించారు.

Tags:    

Similar News