Minister Nara Lokesh: ప్రపంచపటంలో ‘ఏపీ’ నిలిచింది: మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్

Update: 2026-06-02 12:18 GMT

Minister Nara Lokesh: సమర్థవంతమైన నాయకత్వం, త్వరిత నిర్ణయాలు, వ్యాపార స్నేహపూర్వక విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంపై స్థానం సంపాదించాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ముంబయిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ‘అభివృద్ధికి కొత్త సరిహద్దులు’ అనే అంశంపై నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్-2026లో లోకేశ్ పాల్గొన్నారు. ‘భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం.. ఆంధ్రప్రదేశ్ అనుభవం’ అనే థీమ్‌పై జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో మంత్రి ప్రసంగించారు.

లోకేశ్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని వివరించారు. కొత్త నగరాల నిర్మాణం, ఎకోసిస్టమ్‌ల సృష్టిలో చంద్రబాబు నాయుడు అనుభవం మొదటిది. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రెండోది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్టును 17 నెలల్లో ప్రారంభించడం దీనికి ఉదాహరణలు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మూడో కారణమని చెప్పారు.

ముఖ్యాంశాలు:

ఏఐలో అగ్రస్థానం: ఏపీని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలని చంద్రబాబు లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌లను నిర్మించాలని యోచన. గూగుల్ డేటా సెంటర్ 13 నెలల్లోనే వచ్చింది.

డేటా సెంటర్లు & ఉద్యోగాలు: డేటా సెంటర్లు ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. విశాఖలోని కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏఐ, ఐటీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి.

నీటి వినియోగం: 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు సంవత్సరానికి కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే అవసరం. గోదావరి నుంచి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు.

ప్రాజెక్టుల వేగం: ఏఏంసీఏ (5వ తరం స్టెల్త్ ఫైటర్) ప్రాజెక్టుకు 600 ఎకరాలు 36 రోజుల్లో సేకరించి కేంద్రానికి ఉచితంగా అందించాం.

అభివృద్ధి ఆకృతి: రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. తీరప్రాంత ప్రయోజనాలను వినియోగించి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు సేవలందించే ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతాం. మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి లక్ష్యం.

‘స్పీడ్.. సింప్లిఫికేషన్.. స్టెబిలిటీ’ అనేది మా విజయ మంత్రం. పెద్ద సంస్థలతోపాటు ఎంఎస్‌ఎంఈలను కూడా ప్రోత్సహిస్తాం. డేటా సెంటర్లపై ఉన్న భయాలను తొలగించి, యువతకు అవకాశాలను వివరించాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.

2028 నాటికి అమరావతి కోర్ క్యాపిటల్ సిద్ధమవుతుందని, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ తర్వాత అమరావతిని నిర్మిస్తున్నారని లోకేశ్ గుర్తు చేశారు.

Tags:    

Similar News