Minister Nara Lokesh: ప్రపంచ స్థాయి ‘మైస్’ గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్

Update: 2026-05-12 16:21 GMT

Minister Nara Lokesh: అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతులు వేగంగా అందించడం కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

సింగపూర్ పర్యటనలో భాగంగా సన్‌టెక్ సిటీని సందర్శించిన మంత్రి లోకేశ్, డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయి మైస్ (Meetings, Incentives, Conferences, Exhibitions) ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దీనికోసం కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నాం” అని వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని హోటళ్ల గదుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 20 వేలకు చేరుకుంటుందని, ప్రముఖ జాతీయ-అంతర్జాతీయ ఆతిథ్య సంస్థలు అమరావతికి వస్తున్నాయని ఆయన తెలిపారు. మైస్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మైస్ కేంద్రం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

భారత ప్రభుత్వ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్‌తో కలిసి విశాఖలో ‘ఆంధ్ర మండపం’ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. విశాఖ తీరప్రాంతంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీలు స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.

సన్‌టెక్ సిటీ గురించి వివరిస్తూ ఆనందన్ కరుణాకరన్, సింగపూర్ డౌన్ టౌన్ వ్యాపార కేంద్రంలో 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అధునాతన సాంకేతికతతో ఈ ఈవెంట్ ప్లేస్‌ను తమ సంస్థ రూపొందించిందని మంత్రికి తెలిపారు. సింగపూర్‌ను సురక్షిత, విశ్వసనీయ, అగ్రశ్రేణి గమ్యస్థానంగా నిలబెట్టడానికి సింగపూర్ టూరిజం బోర్డు విస్తృత ప్రచారం చేస్తోందని కూడా పేర్కొన్నారు.

ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి ఈవెంట్స్ హబ్‌గా మార్చడంలో కీలకమవుతుందని మంత్రి లోకేశ్ వ్యక్తం చేశారు.

Tags:    

Similar News