Kollu Ravindra: ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం

కొల్లు రవీంద్ర ధ్వజం

Update: 2026-06-13 10:19 GMT

Kollu Ravindra: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలి తీసుకుందని ఆరోపించారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, బాబాయి హంతకులను కాపాడుతూ సొంత చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచిన జగన్‌ను తీవ్రంగా విమర్శించారు.

విద్యుత్ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపారని, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. జీఓ నం. 117 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని ఆరోపించారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వ సాధించిన విజయాలు:

2024 ఎన్నికల్లో 94 శాతం సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించి జగన్ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ఐదేళ్ల విధ్వంసాన్ని తుడిచేసి రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. కూటమి సానుకూల విధానాల వల్ల దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి దక్కాయని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, రెండేళ్లలో రూ.65 వేల కోట్లు నేరుగా పేదలకు పంపిణీ చేశామని వెల్లడించారు.

మెగా డీఎస్సీ ద్వారా 16,430 ఉపాధ్యాయులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని, ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) ద్వారా 71 కోట్ల మంది మహిళలకు లాభం చేకూర్చామని చెప్పారు. దీపం-2 కింద 4.26 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, 24 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ప్రకటించారు. 21 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జగన్ హయాంలో 85 శాతం హామీలు అమలు కాకపోగా, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 90 శాతం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిందని ఉద్ఘాటించారు.

ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోందని, దొంగనాటకాలు ఆడి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు.

Tags:    

Similar News