Pawan Kalyan Expresses Anger: రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ కవర్‌ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టును కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేరా? నిర్దేశిత సమయంలో బాధ్యతగా పని చేయకపోతే ఎలా అని అటవీశాఖ అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీన్‌ కవర్‌ను 50 శాతానికి పెంచడం కోసం వారం రోజుల్లోనే ఏపీ గ్రీన్‌ సొసైటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

చైనా, జపాన్, సింగపూర్‌ తదితర దేశాల్లో పట్టుబడిన ఏపీకి చెందిన ఎర్రచందనం తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. నిర్దేశిత కార్యక్రమాలను అమలు చేయడంలో, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా పని చేయని కొందరు అధికారులపై మండిపడ్డారు.

‘వనజీవి రామయ్య, దుశర్ల సత్యనారాయణ’ లాంటి పర్యావరణ ప్రేమికులు ఒంటరిగా తమ జీవితాలను అర్పించి అద్భుతాలు సృష్టించారని, ఒక వ్యవస్థగా మనం ఎంతో చేయాల్సి ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అటవీ భూముల కబ్జా: కఠిన చర్యలు

అటవీ భూముల్లో ఎంత ఆక్రమణ జరిగింది, ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారో అటవీ శాఖ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని ఆదేశించారు.

ఇటీవల చిత్తూరు జిల్లా మంగళం అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూమిని కూడా వెనక్కి తీసుకొచ్చామని చెప్పారు.

ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అటవీ భూముల రక్షణకు జియోట్యాగ్ స్పెషల్ సర్వే, కర్ణాటక మోడల్‌లో సరిహద్దుల పర్యవేక్షణ, శాటిలైట్‌, అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించాలని సూచించారు.

పచ్చదనం పెంపు: 2.5 కోట్ల విత్తన బంతులు

స్వచ్ఛ, పచ్చని ఏపీ నిర్మాణం లక్ష్యంగా అటవీశాఖ 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయనుంది. ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతో కలిసి జులై-ఆగస్టు నెలల్లో డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లనున్నారు.

ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Tags: