Guntakal-Ballari Railway Lines: గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

Update: 2026-07-25 11:05 GMT

Guntakal-Ballari Railway Lines: గుంతకల్లు-బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుతో తూర్పు, పడమర రైల్వే కారిడార్ మరింత బలోపేతం అవుతుందని, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రయాణికులు, సరకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రస్తుత రైల్వే మార్గాలపై రద్దీ తగ్గుతుందని వివరించారు. రూ.1,264 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.600 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఖర్చవుతాయని చంద్రబాబు తెలిపారు.

ఈ ప్రాజెక్టు వల్ల పరిశ్రమలకు ఊతం లభించడంతో పాటు కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు అనుసంధానం మెరుగై కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పడతాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన ప్రగతికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News