CM Chandrababu: చంద్రబాబు: ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. 45 రోజుల్లో అనుమతులు, జాప్యం లేదు: విశాఖలో పెట్టుబడిదారులకు సీఎం హామీ

విశాఖలో పెట్టుబడిదారులకు సీఎం హామీ

Update: 2025-11-13 11:30 GMT

CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తున్నామని, అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖలోని నోవాటెల్‌లో గురువారం నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ సమావేశంలో మాట్లాడుతూ, గూగుల్ 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇండియా-యూరప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఈ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తాయని చెప్పారు.

సీఎం మాట్లాడుతూ, "అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా, 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పోర్టులు, రైల్వేల అనుసంధానం, నైపుణ్యవంతమైన యువత అందుబాటులో ఉన్నారు. కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ, ఏపీలో పెట్టుబడులు పెట్టండి" అని పిలుపునిచ్చారు.

గ్రీన్ ఎనర్జీలో విప్లవం.. డ్రోన్, స్పేస్ సిటీలు

గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని, ఏపీలో 160 గిగావాట్లకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీల్లో రాష్ట్రం బలంగా ఉందని, వివిధ రకాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. "డ్రోన్‌లను పెద్ద ఎత్తున వాడుకలోకి తెస్తున్నాం. డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి, ఉత్పత్తికి దోహదపడుతుంది. స్పేస్ సిటీని కూడా నిర్మిస్తున్నాం. రవాణా రంగంలో పెద్ద ఎత్తున పోర్టులు నిర్మాణం చేస్తున్నాం" అని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి, పలు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు కీలకమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News