Chandrababu, JP Nadda Hold Key Meeting: చంద్రబాబు, జేపీ నడ్డా సమావేశం.. కీలక ప్రాజెక్టులపై చర్చలు, విజయవాడలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
Chandrababu, JP Nadda Hold Key Meeting: రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ఆరోగ్య రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు.. కేంద్రం సహకారం, రాష్ట్ర సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే నెం.1 స్థానం దక్కిందని అన్నారు. 500 బెడ్లతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని, సంజీవని ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని తెలిపారు.
‘‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్‌గా మారబోతోంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. అర్హులైన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. జేపీ నడ్డా నాయకత్వంలో ఆరోగ్య రంగంలో కొత్త విష్కరణలు వచ్చాయి. ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు డబుల్ ఇంజిన్ సర్కారే కారణం. 2047 నాటికి ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలి’’ అని సీఎం అన్నారు.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఏపీలో రూ.1,271 కోట్లతో 24 క్రిటికల్ బ్లాకులు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని తెలిపారు. చంద్రబాబుతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
‘‘గత దశాబ్ద కాలంగా దేశంలో ఎన్నో ఆరోగ్య విధానాలు తీసుకొచ్చాం. ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు గర్విస్తున్నా. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో ముందడుగు. ఇలాంటి కార్యక్రమాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబుకు అభినందనలు. కొవిడ్ తర్వాత ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడంపై మోదీ దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో రూ.64 వేల కోట్లతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నాం. వంటగదే ఫార్మసీ, ఆహారమే ఔషధమని చంద్రబాబు తరచూ చెబుతారు.. అది అక్షరాలా నిజం’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.