MLC Ranga Gopal Reddy: క్రీడాకోటా నియామకాలపై ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఫైర్.. జగన్ అవార్డులు నకిలీవా?
జగన్ అవార్డులు నకిలీవా?
MLC Ranga Gopal Reddy: కష్టపడి క్రీడల్లో పతకాలు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులపై వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. అర్హులైన క్రీడాకారులను నకిలీలంటూ వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు.
శుక్రవారం కడపలో విలేకర్లతో మాట్లాడుతూ, పతకాలు సాధించిన క్రీడాకారుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వైకాపా హయాంలోనే వారు అందుకున్న పురస్కారాల వివరాలను ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ప్రదర్శించారు.
సాఫ్ట్‌బాల్ విజేత శివాజీనాయక్ జాతీయస్థాయిలో 40కి పైగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారని, మాజీమంత్రి రోజా చేతులమీదుగా అవార్డు పొందారని, జగన్ ప్రభుత్వం రూ.3 లక్షల నగదు బహుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. “వైకాపా ఇచ్చిన జీవో, అవార్డులు ఇప్పుడు నకిలీవా?” అని ప్రశ్నించారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఖోఖో క్రీడాకారుడు రామ్మోహన్‌ను నాటి సీఎం జగన్ సత్కరించి అభినందించారని, అతడిని ఈ రోజు నకిలీ అని నిందించడం వైకాపా దిగజారుడుతనానికి నిదర్శనమని రాంగోపాల్‌రెడ్డి అన్నారు. హ్యాండ్‌బాల్ ప్లేయర్ వీరాంజనేయులు యోగి వేమన విశ్వవిద్యాలయం జట్టు కెప్టెన్‌గా, కాలికట్ పోటీల్లో ప్రతిభ చూపిన విజయాలపై గతంలో సాక్షి పత్రికలోనే ప్రశంసల వార్తలు వచ్చాయని గుర్తుచేశారు.
నాగరాణి (వాలీబాల్), వాణి (బాల్ బ్యాడ్మింటన్), కావేరి (ఖోఖో) వంటి వారు శ్రీ వేంకటేశ్వర వర్సిటీ, యోగివేమన వర్సిటీలకు ప్రాతినిధ్యం వహించి, టెట్‌లో 90కి పైగా మార్కులు సాధించి ఉద్యోగాలు పొందారని, వీరి కష్టాన్ని నకిలీ అని బ్రాండింగ్ చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
గ్రూప్-1 అక్రమాలు బయటపడతాయనే భయంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎస్సీ, క్రీడాకోటాపై జగన్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు.