Chief Minister Nara Chandrababu Naidu: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక
ఎంపిక
Chief Minister Nara Chandrababu Naidu: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీల విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు.
కూటమి పార్టీల ఆమోదంతో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చి ఎస్సీ సామాజికవర్గం నుంచి వర్ల రామయ్య, బీసీల నుంచి దళవాయి రమాదేవికి అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. సాధారణ కార్యకర్తగా, క్లస్టర్ ఇన్‌ఛార్జిగా పనిచేసిన రమాదేవికి గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పామని ఆయన వివరించారు. మొదటిసారిగా వడ్డెర సామాజికవర్గానికి చెందిన మహిళకు ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం లభించిందని సీఎం పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించడం ఇదే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామయ్య, రమాదేవిలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సిఫారసును గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
వర్ల రామయ్య ప్రొఫైల్
1974లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన వర్ల రామయ్య 1987లో సీఐగా పదోన్నతి పొందారు. 26 ఏళ్లపాటు సేవలందించి ప్రధానమంత్రి పోలీసు పతకం, ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవాపతకం, మహోన్నత సేవా పతకాలు సాధించారు. పదేళ్ల సర్వీసు ఉండగానే పదవీవిరమణ చేశారు. దళిత్ జ్యోతి, దళిత్ విద్యాదానం కార్యక్రమాల ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేశారు. 2001 జూలైలో తెదేపాలో చేరి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2009లో తిరుపతి లోక్‌సభకు, 2014లో పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014-19 మధ్య గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా, తర్వాత ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
దళవాయి రమాదేవి ప్రొఫైల్
తెదేపా పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. అప్పటి వైకాపా ప్రభుత్వ వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ 2021లో అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి 37 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో పార్టీ యూనిట్ ఇన్‌ఛార్జి, అంగన్‌వాడీ విభాగ సాధికారిక కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం క్లస్టర్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆమె భర్త వెంకటనారాయణ 25 ఏళ్లుగా తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తూ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో ఎంతోమంది పోటీలో ఉన్నా రమాదేవికి తెదేపా అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇటీవల మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌ఛార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించిన పార్టీ అదే ఒరవడిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలోనూ కొనసాగించింది.