Minister Lokesh Clarifies: విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే అత్యుత్తమమైన ఏఐ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు తెలిపారు.

విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.

6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలోని పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్ నీటి వినియోగం దాదాపు పదో వంతేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తైందని, పర్యావరణ బాధ్యతతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

Tags: