Minister Narayana: రెండేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛ నదీజలాలు: మంత్రి నారాయణ
మంత్రి నారాయణ
Minister Narayana: రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల వ్యయంతో అమృత్ పథకం కింద మంచినీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరు 54వ డివిజన్‌లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన మంచినీటి ట్యాంకు పనులకు ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నదీజలాలు అందించే లక్ష్యంతో పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేసి వెళ్లగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్థిక సవాళ్ల మధ్యనూ అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీకి తావు ఇవ్వడం లేదని ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలన అందిస్తున్నామన్నారు.
ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందించడం ప్రభుత్వ లక్ష్యమని, పీ4 ద్వారా పేదలకు చేయూత అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు నారాయణ చెప్పారు. పేదరిక నిర్మూలన విద్యా అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.