CM Chandrababu Issues Strong Warning: సీఎం చంద్రబాబు: గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. స్ట్రాంగ్ వార్నింగ్

స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2026-06-06 12:22 GMT

CM Chandrababu Issues Strong Warning: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, డీఎస్‌సీ వంటి అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా విమర్శించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులెత్తేసింది. సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి పక్కన పెట్టేసింది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మాట తప్పింది” అని ధ్వజమెత్తారు.

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో వ్యవస్థలను విధ్వంసం చేశారని, డీఎస్‌సీ-2025పై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో దుష్ప్రచారం చేసినట్లుగానే డీఎస్‌సీ విషయంలో కూడా అదే తంతు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

“డీఎస్‌సీ నిర్వహణపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చాం. దానితో వారు డిఫెన్సులో పడ్డారు. దుష్ప్రచారం, ఫేక్ రాజకీయాలు వారి విధానం. గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం” అని సీఎం స్పష్టం చేశారు.

చెడు ఆలోచనలు చేసేవారి చుట్టూ గొడ్డలి బ్యాచ్ జమ అవుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఇకపై ఓటమి లేదని, ప్రజలతో మంచిగా ఉంటూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీలో పదవులు నుంచి టికెట్ల కేటాయింపు వరకు నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని చెప్పారు.

లోకేశ్ చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించిన సీఎం, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నాహాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

Tags:    

Similar News