CM Chandrababu Naidu: అర్నబ్ తుపాను బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
CM Chandrababu Naidu: అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, బాధితులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్)లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుపాను నష్టంపై కేంద్రానికి లేఖ రాసినట్లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి కేంద్ర బృందాన్ని పంపాలని కోరినట్లు సీఎం తెలిపారు. ప్రాథమిక నష్టం అంచనా నివేదికను గురువారం కేంద్రానికి పంపిస్తామని, పూర్తిస్థాయి నివేదికను త్వరలోనే పంపుతామని అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
వ్యవసాయ, ఉద్యాన పంటల గణన పూర్తయిన తర్వాత రైతులను కూడా ఆదుకుంటామని, గురువారం నిర్వహించే వర్చువల్ క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. గురువారం, శుక్రవారం క్షేత్రస్థాయికి వెళ్లి నష్ట తీవ్రతను పరిశీలిస్తానని, నష్టం ఎక్కువగా ఉన్న కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రభుత్వ సూచనలను పాటించి ప్రజలు పూర్తి సహకారం అందించారని, తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు.
గత ప్రభుత్వం ఆర్టీజీఎస్‌ను నిర్లక్ష్యం చేసినప్పటికీ, కష్టం వస్తే ప్రభుత్వం మళ్లీ నిలబెడుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించామని చంద్రబాబు పేర్కొన్నారు. తుపాను ప్రభావంపై మూడు రోజులుగా ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం సమీక్షలు చేసి, సాంకేతికత ఆధారంగా తీవ్రతను గుర్తించి క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు. సేఫ్-సెక్యూరిటీ-రీహాబిలిటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ అధికారులను సన్నద్ధం చేసి, ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఐదుగురు చనిపోవడం, పంటలు నష్టపోవడం బాధ కలిగించిందని వెల్లడించారు.
విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగిందని, ఈదురుగాలులకు 15 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని సీఎం తెలిపారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, ఈ రెండు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రానికి పూర్తిగా పునరుద్ధరిస్తామని అన్నారు. అన్ని రహదారుల్లో బుధవారం రాత్రికే అంతరాయాలు తొలగించామని చెప్పారు.
పరిహారం వివరాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే 25 కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, చేనేత మగ్గాలు, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున ఉల్లిపాయలు, వంటనూనె, కందిపప్పు, పంచదార, దుంపలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం, ఇల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, దుకాణాలకు రూ.25 వేలు సాయం అందిస్తామని అన్నారు.
రూ.40 లక్షల టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి రూ.1.50 కోట్ల టర్నోవర్ ఉన్నవాటికి రూ.1.50 లక్షల వరకు పరిహారం ఇస్తామని చెప్పారు. ద్విచక్ర వాహనం దెబ్బతింటే రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేత మగ్గాలు దెబ్బతింటే రూ.25 వేలు, ఫిషింగ్ బోటు, వలలు ధ్వంసమైతే మరమ్మతులకు రూ.5 వేల నుంచి రూ.25 వేలు వరకు సాయం అందిస్తామని వివరించారు. హెక్టారు పత్తికి రూ.25 వేలు, చెరకుకు రూ.25 వేలు, అరటి పంటకు రూ.35 వేలు, టమాటాకు రూ.25 వేల చొప్పున సాయం ఇస్తామని పేర్కొన్నారు.
అర్నబ్ అతి తీవ్ర తుపానుపై బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారని సీఎం తెలిపారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6.15 గంటలకే కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నష్టాలపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
తుపాను కారణంగా వర్షాలతో రాష్ట్రం సగటు వర్షపాతం లోటు 39 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని సీఎం వెల్లడించారు. ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో ఒక్క చెరువుకు కూడా గండి పడలేదని, విపత్తు సమయంలో పనిచేసిన ఉన్నతాధికారులు, కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.