Cyclone Arnab: అతి తీవ్ర తుపాను అర్నబ్‌ కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. పెనుగాలులకు వేల వృక్షాలు పడిపోగా, అదే స్థాయిలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పలు జిల్లాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి అంధకారంలోనే ఉన్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా కాస్త ప్రభావం చూపింది. తుపాను తీరం దాటే సమయంలో ప్రచండగాలులు వీచాయి. విద్యుత్‌స్తంభాలు విరిగిపడి, చెట్లు కూలి, ఇళ్లు కూలి.. ఇలా వేర్వేరు ఘటనల్లో రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. కాలువ దాటబోతూ ఓ ఏఎన్‌ఎం గల్లంతయ్యారు.

అతి తీవ్ర తుపాను నెమ్మదిగా వాయవ్య దిశగా కదులుతూ నరసాపురానికి తూర్పు ఈశాన్యంగా 20 కి.మీ., యానాంకు నైరుతిగా 40 కి.మీ., కాకినాడకు నైరుతిగా 60 కి.మీ. దూరంలో తీరాన్ని తాకింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సమయంలో 125 నుంచి 150 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ ఏపీ, యానాం తీరాలకు ఆనుకొని పశ్చిమమధ్య బంగాళాఖాతంపై కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 11.30 గంటల తర్వాత తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్‌ సాయంత్రానికి తుపానుగా, అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. గురువారం ఉదయానికి వాయుగుండంగా మారి రాత్రికి అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమగోదావరి జిల్లా చిగురుటాకులా వణికింది. యానాంలో తీరం దాటుతుందని అనుకున్నా దిశ మార్చుకుని నరసాపురంలో దాటడంతో తీవ్ర ప్రభావం పడింది. ఈదురుగాలులకు జనజీవనం స్తంభించింది. మంగళవారం మధ్యాహ్నం నిలిచిపోయిన విద్యుత్తు సరఫరాను బుధవారం కూడా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు చీకట్లోనే మగ్గాల్సి వచ్చింది. భీమవరంలో సుంకరపెద్దియ్య వీధికి చెందిన సీహెచ్‌.కిశోర్‌కుమార్‌ (46) సమీపంలో దుకాణానికి వెళ్తుండగా చెట్టు, విద్యుత్తు స్తంభం మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. యలమంచిలి మండలంలో రెండుచోట్ల పశువుల పాకలు కూలిపోయి రెండు గేదెలు మృతిచెందాయి. పేరుపాలెం, ఆచంటలంక గ్రామాలు, ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 350 మందిని 24 పునరావాస కేంద్రాలకు తరలించారు. 22 మంది గర్భిణులను సమీపంలోని పీహెచ్‌సీలకు తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం నుంచి బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో 550కి పైగా విద్యుత్తు స్తంభాలు, 5వేలకు పైగా వృక్షాలు నేలకొరిగాయి.

జిల్లాలో ఖరీఫ్‌లో 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా 70 శాతానికి పైగా నేలవాలింది. 19 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తుండగా సగానికిపైగా దెబ్బతిన్నాయి. పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో నష్టతీవ్రత ఎక్కువగా ఉంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భీమవరం జంక్షన్, నరసాపురం రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు రైళ్లను రద్దుచేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. కోనసీమలో కొబ్బరిచెట్లు, మత్స్యకారుల బోట్లు భారీగా ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు భీకరగాలులు, భారీవర్షం కురవడంతో ప్రజలంతా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. వేలసంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో జిల్లా అంతా అంధకారం నెలకొంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 9,527 స్తంభాలు నేలకూలాయి. 1.18 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. అత్యధికంగా గోపాలపట్నంలో 31 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Tags: