CM Chandrababu Naidu: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అర్నబ్ తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత, తుపాను తీరాన్ని దాటిన తర్వాత సహాయక చర్యల పర్యవేక్షణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఆయన తుపాను బాధిత ప్రాంతాల ప్రజలకు సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో ఆ పనుల్లో నిమగ్నమయ్యేలా చేస్తున్నారు.

తుపాను వల్ల ఆస్తి, ప్రాణనష్టాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించే చర్యలపై ముందుగా దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి వరుస సమీక్షలతో క్షేత్రస్థాయి వరకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు అధికారులతో పలు దఫాలు సమీక్షిస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం 6.15 గంటల నుంచే మళ్లీ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్షలు ప్రారంభించారు.

బుధవారం ఉదయం 11.30 గంటలకు హోరు వానలో సచివాలయానికి చేరుకున్న ఆయన రాత్రి వరకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం రాత్రి వరకు మూడు రోజుల్లో 10 సార్లు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. మంత్రులు, అధికారుల్ని క్షేత్రస్థాయికి పంపించారు. గురువారం ఉదయం కేబినెట్ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించి, అందులో ప్రధానంగా తుపాను బాధితులకు సహాయ చర్యలపైనే చర్చించారు.

సమావేశం ముగియగానే తుపాను బాధిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రాంతంలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. సాయంత్రానికి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఆయన రెండున్నర గంటలపాటు తుపాను సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.

సీఎం శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. చివరి వ్యక్తికి సహాయం అందేవరకు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఇబ్బంది తొలగేవరకు విశ్రమించవద్దని అధికారులకు సూచించారు. ఆదివారం నాటికి అన్ని చోట్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తికావాలని లక్ష్యం నిర్దేశించారు.

Tags: