Cyclone Arnab: అర్నబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, రైలు మార్గాలపైనా వరదనీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.


ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. దీంతో ఇచ్ఛాపురం, పలాస, మందస, పాతపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలు నీటమునిగాయి. గురువారం ఒక్కరోజులోనే బాహుదా నదికి 86,458 క్యూసెక్కుల వరదనీరు చేరింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నీరు నిలవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జగన్నాథపురం, లొద్దపుట్టి, ధర్మవరం, తోటవూరు, బెల్లుపడ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2013లో 83 వేల క్యూసెక్కులు వచ్చిన బాహుదా నదికి ఇప్పుడు అంతకంటే ఎక్కువ నీరు పోటెత్తింది. మహేంద్రతనయ నది నీరు పాతపట్నం మండలంలోని అచ్యుతాపురం, చంగుడి, గోపాలపురం, కొరసవాడ గ్రామాల్లోకి చేరి ముంపు సృష్టించింది.


వంశధార గొట్టాబ్యారేజీ వద్ద 73,324 క్యూసెక్కులు నమోదుకావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగావళి నది నారాయణపురం ఆనకట్ట వద్ద 40,500 క్యూసెక్కులు ప్రవహించింది. రణస్థలంలోని తోటపల్లి కాలువ, జి.సిగడాం టి.డి.వలస చెరువు గండిపడటంతో సమీప పొలాలు ముంపునకు గురయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 728 గ్రామాల్లో 21,590.64 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఉద్యానవన శాఖ పరిధిలో 383.80 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సోంపేట-బారువ రహదారికి ఇరువైపులా ఏడు కిలోమీటర్ల పొడవునా పంట పొలాల్లో పది అడుగుల మేర నీరు నిలిచింది. బారువ వద్ద మూడు ఎకరాల కొబ్బరితోట కొట్టుకుపోయింది.


ఇచ్ఛాపురం-జాడిపూడి మధ్య రైలు పట్టాలపై నీరు ప్రవహించడంతో రైళ్లను ఎక్కడివక్కడ నిలిపివేశారు. రైలు వంతెనను ఆనుకుని ప్రవాహం ఉండటంతో ఆందోళన నెలకొంది. నీరు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం కొన్ని రైళ్లను కదిలించారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వంగర మండలంలోని కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి; రేగిడి మండలంలో ఏవీపురం, రేగిడి; సంతకవిటి మండలంలో మండవకురిటి, జావాం, కేఆర్‌పురం, మందరాడ, గోవిందపురం, సంతకవిటి, చింతలపేట, వాసుదేవపట్నం గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. బలిజిపేట మండలంలోని నూకలవాడ, వంతరాం గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి.


అరకు మార్గంలో రోడ్డు, రైలు సేవలు మూతపడ్డాయి. అరకు-విశాఖపట్నం ఘాట్‌రోడ్‌లో గాలికొండ వద్ద రహదారి జారిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల పాటు రహదారిని పునరుద్ధరించలేమని ఎన్‌హెచ్‌ అధికారులు తెలిపారు. కొత్తవలస-కిరండూల్‌ రైలు మార్గంలో బొర్రా-కరకవలస స్టేషన్ల మధ్య ట్రాక్‌ దెబ్బతినడంతో పాసింజర్‌ రైలును రద్దు చేశారు. నవంబర్‌ 3 వరకు రైలు తిరిగే అవకాశం లేదు. కిరండూల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా 15 రోజుల నుంచి రద్దులోనే ఉంది.

ఉత్తరాంధ్ర యావత్తు ఇంకా మునకలోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

Tags: