CM Chandrababu Naidu Warns: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో సోమవారం ఉదయం ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.

"హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టిన వైకాపా రెచ్చగొట్టినా వారి ఉచ్చులో పడకూడదు. అలా చేస్తే మనకు వారికీ తేడా ఉండదు. ప్రజలకు మేలు చేయడమే మన పార్టీ సిద్ధాంతం. ఈ విషయాన్ని శ్రేణులకు స్పష్టంగా చెప్పండి" అని చంద్రబాబు సూచించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, సంయమనంతో వ్యవహరించాలని నాయకులు, కార్యకర్తలకు ఆదేశించారు. మంత్రులు, సీనియర్ నేతలు ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

వైకాపా నాయకులు రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా కుట్రలు పన్నుతున్నారని, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘోర పాపాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పక్కదారి పట్టించాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. "తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరతాం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేయడమే మన ప్రధాన ఎజెండా. దీన్ని చెడగొట్టేందుకు వైకాపా శతవిధాలా ప్రయత్నిస్తోంది" అని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చట్టాన్ని గౌరవించే బలమైన బ్రాండ్ ఇమేజ్ తెదేపాకు ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు అన్నీ స్పందించాల్సిన అవసరం లేదని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన మేలును క్షేత్రస్థాయిలో వివరించాలని ఆయన సూచించారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైకాపా నేతలు నీచ కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. "దుర్భాషలు, జుగుప్సాకర వ్యాఖ్యలు అసహ్యం కలిగిస్తున్నాయి. దాడులు, హింస తెదేపా సంస్కృతి కాదు. వైకాపా ఉచ్చులో పడకుండా ఓపికతో వ్యవహరించాలి. రాష్ట్రానికి నష్టం రాకుండా జాగ్రత్తలు పాటించాలి" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు సంయమనం, చట్టబద్ధతతో ముందుకు సాగాలని స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది.

Tags: