Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ప్రకటించారు. వివిధ శాఖల సమన్వయంతో తయారు చేసిన ఈ ప్రణాళికను త్వరలో పిఠాపురం పర్యటన సందర్భంగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రణాళిక మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ 9న కాకినాడ కలెక్టరేట్‌లో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నాలు చేశామని, తీర ప్రాంతంలో కాలుష్య నివారణ, సముద్ర కోతల నిరోధం, మత్స్య సంపద పెంపు, ఆధునిక వేట పద్ధతులు, మార్కెటింగ్ సౌకర్యాలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ వంటి కీలక అంశాలను ఈ ప్రణాళికలో చేర్చామని వివరించారు.

అంతేకాకుండా, ఉప్పాడ గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికతో మత్స్యకార సమాజం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags: