CM Chandrababu: పులివెందులలో విధ్వంస కుట్ర.. జగన్పై సీఎం చంద్రబాబు ధ్వజం
సీఎం చంద్రబాబు ధ్వజం
CM Chandrababu: పులివెందుల పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. కూటమి పార్టీల నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు.
పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ సరళిపై కూటమి పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆదివారం టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ స్థాయి స్ఫూర్తి కనిపించలేదని పేర్కొన్నారు. చాలా పురపాలికల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు తీరారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తక్కువ పోలింగ్ నమోదైందని తెలిపారు.
ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులకు సహకరించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కూటమి నేతలు, కార్యకర్తలను ఆదేశించారు.