SEC Punetha: రీపోలింగ్‌కు ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకోలేం: ఎస్ఈసీ పునేఠా
ఎస్ఈసీ పునేఠా
SEC Punetha: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రీపోలింగ్ ఆదేశాలు జారీ చేయాలంటే తగిన ఆధారాలు, కలెక్టర్, ఎస్పీల నివేదికలు అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని, ఎన్నికల సంఘం ఎప్పుడూ తటస్థంగానే వ్యవహరిస్తుందని తెలిపారు.
ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసాక కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారితో కలిసి విలేకర్లతో మాట్లాడిన పునేఠా, పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో చిన్న గొడవలపై ఫిర్యాదులు వచ్చినా, చాలా జిల్లాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిందని వివరించారు. 12 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించానని, శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.3 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
అనంతపురం, పల్నాడు జిల్లాల్లో జరిగిన కొన్ని ఘటనలపై ప్రిసైడింగ్ ఆఫీసర్ నివేదికలు, వెబ్‌కాస్టింగ్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని పునేఠా అన్నారు. తటస్థంగా వ్యవహరిస్తున్నందునే పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయని, వాటిలో తెదేపా కూడా ఉందని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని, మదనపల్లెలో మూడు ఫిర్యాదులపై కలెక్టర్‌తో మాట్లాడానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఒక ఫిర్యాదులో సరైన ఆధారం లేదని కలెక్టర్ చెప్పారని వివరించారు.
పులివెందులలో 70 పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్లు లేరన్న సమాచారంపై ఎస్పీతో మాట్లాడానని, ఏజెంట్ల వివరాలిస్తే పోలీసు భద్రతతో పంపుతానని ఫిర్యాదుదారులకు చెప్పానని పునేఠా అన్నారు. విజయవాడలోని 55వ డివిజన్లో పోలింగ్‌ను సాయంత్రం 7.30 వరకు పొడిగించామని, బ్యాలట్ పేపర్లలో గుర్తులు తేడా రావడంతో ఉదయం గంటన్నరపాటు పోలింగ్ నిలిచిపోయిందని, అధికారులు మళ్లీ ముద్రించి ప్రారంభించారని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని ఇప్పటివరకు 275 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 107 మందిని అరెస్టు చేశామని ఐజీ రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం పోలింగ్ సందర్భంగా 40 ఘటనలు చోటుచేసుకున్నాయని, కేసులు నమోదు చేయదగ్గ పరిస్థితులు ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు.