Cyclone Montha: మొంథా తుపాను: బలపడుతున్న వాయుగుండం.. తీరాన్ని దాటే అవకాశం

తీరాన్ని దాటే అవకాశం

Update: 2025-10-27 11:16 GMT

Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి బలపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో ముందుకు సాగింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే సూచనలున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 600 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 570 కి.మీ., చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ., పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమంగా 750 కి.మీ. దూరంలో ఉంది. తీర ప్రాంతాల్లో 50-70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే వీలుంది. తుపాను తీరం దాటేటప్పుడు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ముందస్తు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

మొంథా తుపాను దూసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారుల సెలవులు రద్దు చేసి, సహాయ చర్యలకు రూ.19 కోట్ల నిధులు విడుదల చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు సిద్ధం చేశారు. 57 తీరప్రాంత మండలాల్లో 219 తుపాను ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు తిరిగి రప్పించారు. తీర ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు.

అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో మంగళవారం వరకు సెలవులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలు మోహరించారు. 9 ఎస్‌డీఆర్‌ఎఫ్, 7 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అలర్ట్‌లో ఉన్నాయి. టీఆర్-27 కింద నిధులు మంజూరు చేసి, సహాయ శిబిరాలు, తాగునీరు, ఆహారం ఏర్పాటు చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో ముక్కాం తీరప్రాంత గ్రామంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలన చేశారు. మత్స్యకారులతో మాట్లాడి, సురక్షిత చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News