Chandrababu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోనే నదుల అనుసంధానం సాధ్యమవుతుందని, ఆయన నాయకత్వంలో భారత్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన ‘వారణాసి-వడ్‌నగర్‌ సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంధానిస్తే దేశ అభివృద్ధి ప్రయాణం అన్‌స్టాపబుల్‌గా మారుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచం ముందు భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. “ఆజ్‌ మై కాశీకీ పవిత్ర ధర్తీ ఫర్‌ ఖడా హూం... ఏ మేరే లియే గర్వ్‌ కా క్షణ్‌ హై” అంటూ హిందీలో ప్రసంగం ప్రారంభించి, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో మాట్లాడారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసిన మోదీ, ఇప్పుడు అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఐదు నుంచి పదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఎన్‌డీయే ఐక్యతే దేశానికి బలమని, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోరని గుర్తు చేశారు.

మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 80 కోట్లకు పైగా మందికి ఉచిత ఆహారధాన్యాలు, 12 కోట్లకు పైగా ఇళ్లకు మరుగుదొడ్లు, 4 కోట్లకు పైగా ఇళ్లకు తాగునీరు, 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చంద్రబాబు వివరించారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీ అని, స్పేస్‌, డ్రోన్‌, సెమీకండక్టర్‌, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీలను కూడా ఆయన అర్థం చేసుకుని యువతకు లబ్ధి చేకూర్చగలరని అన్నారు.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి అధినియమ్‌ గేమ్‌ఛేంజర్‌ అని, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్లపాటు ఏకధాటిగా పాలన చేయడం అసాధారణమని, జాతి ప్రయోజనాల కోసం అందరూ మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముందు చంద్రబాబు కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, చిరాగ్‌ పాస్వాన్‌, యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి అర్చన, అభిషేకం చేశారు. యోగి, అర్చకులు చంద్రబాబు మెడలో రుద్రాక్ష మాల వేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వారణాసి నియోజకవర్గం మోదీ జన్మదినాన్ని ‘నమో’ నామస్మరణతో మార్మోగింది. నేతలు వడ్‌నగర్‌కు సేవా సంకల్ప్‌ బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.

Tags: