Dhulipalla Narendra: కులాల మధ్య విభేదాలు సృష్టించడమే వైకాపా నేతల ఏకైక అజెండా అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. వైకాపా పాలనలో బడుగు వర్గాలపై దాడులు జరిగాయని విమర్శించారు.

గుంటూరులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక చర్యల వల్లే వైకాపా పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైందని అన్నారు.

“ప్రజల తీర్పు చూసినా మార్పు లేదు”

“ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వైకాపా నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. వివాదాలు సృష్టించి యువకులను కేసుల్లో ఇరికించడమే వారి పని. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు” అని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశారని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. “మాట వినలేదన్న కారణంతో అనేక మందిని హత్య చేశారు. ప్రజలు అధికారం ఇవ్వలేదనే అక్కసుతో ప్రస్తుతం కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా డ్రామాలు ఆడటమే వైకాపా నేతలకు అలవాటు” అని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: