Minister Nara Lokesh: ఉపాధి కల్పన మా బ్రాండు.. గొడ్డలి జగన్ బ్రాండు: మంత్రి లోకేశ్
గొడ్డలి జగన్ బ్రాండు: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh: రాయలసీమను రత్నాల సీమగా మార్చడమే తమ ప్రభుత్వం అజెండా అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కడప జిల్లా టి.కోడూరు మండలంలో 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. “11 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక రైతుల త్యాగం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపనకు వస్తున్నాయి” అని లోకేశ్ అన్నారు.
ఉపాధి కల్పన చంద్రబాబు బ్రాండ్
ఉపాధి కల్పన చంద్రబాబు నాయకత్వం వల్లనే సాధ్యమవుతోందని, ఇది తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అని లోకేశ్ హెచ్చరించారు. “గొడ్డలి జగన్ బ్రాండ్ కాదు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నాం. తిరుపతికి రాయల్ ఎన్‌ఫీల్డ్, ఫైటర్ జెట్ కంపెనీలు వస్తున్నాయి. గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేసి భరోసా కల్పిస్తామని చెప్పాం. విధ్వంసం చేయడం సులభం.. నిర్మాణం కష్టం” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌లు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన లోకేశ్
కడప జిల్లా పర్యటనలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు.
రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, ఆయన సోదరుడు రమణా రెడ్డి కుటుంబసభ్యులతో మంత్రి మాట్లాడారు. 17 ఎకరాల్లో సమీకృత సేంద్రియ సాగు చేస్తూ, పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వంటి అనుసంధాన పద్ధతులతో స్థిరమైన ఆదాయం సాధిస్తున్న రైతు కుటుంబాన్ని లోకేశ్ అభినందించారు. రైతులు ఇచ్చిన మామిడి పండ్లను ఆయన రుచి చూశారు.
ఈ పర్యటనలో లోకేశ్ రైతుల సమస్యలు విని, ప్రభుత్వం తరఫున అన్ని సహాయాలు అందించేందుకు హామీ ఇచ్చారు.