Vice President Radhakrishnan: ఏలూరులో కొత్త పాప్‌కార్న్ వంగడం ఆవిష్కరణ.. నదుల అనుసంధానంపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కీలక ప్రకటన
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కీలక ప్రకటన
Vice President Radhakrishnan: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో గౌర్మెట్ పాప్‌కార్న్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘‘నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను’’ అని చెప్పుకొచ్చిన ఆయన, రెండు నెలల క్రితం తమిళ పత్రికలో గౌర్మెట్ సంస్థ ఎండీ పట్టాభి విజయగాథను చదివానని, ఒకే ఉత్పత్తిని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంపై అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని, వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, పాప్‌కార్న్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి మనమే ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదగాలని ఆకాంక్షించారు. ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్న పండించడం సాధారణ విషయం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలను అభినందిస్తూ, డ్రోన్లను అద్దెకు ఇచ్చే పథకానికి కేంద్రం రూ.1,200 కోట్లు మహిళా సంఘాలకు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి సీఎం చంద్రబాబు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు.
మహానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం కలగా మిగలదని, కాస్త ఆలస్యం కావచ్చుగానీ వాస్తవ రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. దీనితో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీటి సౌకర్యాలు అందుతాయని, మన ఆహార అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఏడాది దేవుని కృపతో అవసరమైన వర్షాలు కురుస్తాయని, ఆందోళన వద్దని రైతులను ఉద్దేశించి పలికారు. జనవరి 14న దేశమంతా పంటల పండుగను జరుపుకుంటామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో లోహిరి, అసోంలో బిహు రూపంలో జరుపుకుంటారని ప్రస్తావించారు.