CM Chandrababu Naidu: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన: రక్షణ రంగంలో ఏపీకి చారిత్రక రోజు - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Update: 2026-05-15 14:22 GMT

CM Chandrababu Naidu:  దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (AMCA) ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, “పుట్టపర్తి అంటే సత్యసాయి బాబా గుర్తొస్తారు. ఆయన బోధనలు విశ్వశాంతికి ప్రతీక. ఇక్కడ AMCA ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది” అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. కర్నూలు జిల్లాలో డ్రోన్‌ సిటీ ద్వారా ఆధునిక డ్రోన్‌ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రూ.686 కోట్లతో 8 సంస్థలు వస్తాయని, దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మార్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని సీఎం గుర్తు చేశారు. సీమకు నీళ్లు, అభివృద్ధి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు జూన్‌లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్‌లో ఈ ఏడాది 600 కిలోలు, వచ్చే ఏడాది 1,500 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

“ఇకపై కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారు” : రాజ్‌నాథ్‌ సింగ్‌

రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా రక్షణ ఉత్పత్తులు పెంచుతున్నామని, గత పదేళ్లలో ఈ రంగంలో మెరుగైన పురోగతి సాధించామని తెలిపారు. డ్రోన్‌ టెక్నాలజీ యుద్ధరంగంలో గేమ్‌ ఛేంజర్‌ అని, కర్నూలులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు ద్వారా రాష్ట్రం డ్రోన్‌ హబ్‌గా మారుతుందని చెప్పారు.

హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ.1,294 కోట్ల పెట్టుబడితో వస్తోందని, ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం మొదలవుతోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేక్కొన్నారు. గతంలో రక్షణ రంగంలో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌ ఇప్పుడు ఉత్పత్తి రికార్డులు సృష్టిస్తోందని, 2004లో రూ.46 వేల కోట్లుగా ఉన్న ఉత్పత్తి ప్రస్తుతం రూ.1.75 లక్షల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, టీజీ భరత్‌, సత్యకుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ఏపీలో రక్షణ తయారీలకు కొత్త బాట వేస్తుందని, ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు పెంచుతుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News