Fuel Savings Following PM’s Call: ప్రధాని పిలుపుతో ఇంధన పొదుపు: చంద్రబాబు, పవన్, లోకేశ్ కాన్వాయ్‌లు సగం తగ్గింపు
చంద్రబాబు, పవన్, లోకేశ్ కాన్వాయ్‌లు సగం తగ్గింపు
Fuel Savings Following PM’s Call: సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తిని ఆచరణలో పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తమ వాహన శ్రేణులను సగానికి తగ్గించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో పొదుపు చర్యలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను 11 వాహనాల నుంచి 4 వాహనాలకు పరిమితం చేశారు. ఎన్‌ఎస్‌జీ భద్రతా బృందం 2 వాహనాలు, ఎస్కార్ట్ సాయంతో గురువారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను కూడా సగం తగ్గించారు. మంత్రి లోకేశ్ తన వాహనశ్రేణిని 4 నుంచి 2కి కుదించుకుని, భద్రతా సిబ్బంది కోసం మినీవ్యాన్ ఏర్పాటు చేశారు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రులంతా తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని, అన్ని స్థాయిల్లోనూ సగం వాహనాలే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంధన పొదుపు అంశంతో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేపట్టింది. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ చర్యలు రాష్ట్రంలో ఇంధన ఆదా, ప్రభుత్వ వ్యయ తగ్గింపుకు ఉదాహరణగా నిలుస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.