Home Minister Anita: సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలం: హోం మంత్రి అనిత

హోం మంత్రి అనిత

Update: 2026-06-26 18:03 GMT

Home Minister Anita: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిపై ఉక్కుపాదం వేసినట్లు హోం మంత్రి వెలగపూడి అనిత ప్రకటించారు. అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి, డ్రగ్స్ నిర్మూలనలో విశేష సేవలు అందించిన 'ఈగల్ టాస్క్ ఫోర్స్' అధికారులకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హోం మంత్రి అనిత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టగలిగామని తెలిపారు. గతంలో 17 నుంచి 20 వేల ఎకరాల్లో సాగుతున్న గంజాయి తోటలను పూర్తిగా నిర్మూలించి, సాగును 'జీరో' స్థాయికి తగ్గించామని వివరించారు. గంజాయి సాగుపై ఆధారపడిన రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం తరపున ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

గత ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 56 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హోం మంత్రి వెల్లడించారు. డ్రగ్స్ కేసుల్లో 6 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. స్థానిక గంజాయి సాగును అరికట్టడంతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

గంజాయి వ్యసనానికి బలై జీవితాలు పాడవుతున్న వారిని రక్షించడానికి రాష్ట్ర వ్యాప్తంగా డీ-అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేశామని అనిత అన్నారు. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందిస్తున్నామని, జైళ్లలో ఉన్న ఖైదీల కోసం కూడా ప్రత్యేక డీ-అడిక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఎన్‌డీపీఎస్ చట్టం మరియు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, గంజాయి లేని నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోం మంత్రి వెలగపూడి అనిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News