Government of Andhra Pradesh: పెట్టుబడులకు పీపీపీ పాలసీ ఊతం..ఆరు మోడళ్లకు రూ.1,500 కోట్ల వీజీఎఫ్
రూ.1,500 కోట్ల వీజీఎఫ్
Government of Andhra Pradesh: రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసేందుకు, ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పాలసీ-2026ను విడుదల చేసింది. సోమవారం జారీ చేసిన ఉత్తర్వులతో ఈ పాలసీ వెంటనే అమల్లోకి వచ్చింది. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా రవాణా, లాజిస్టిక్స్, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్ కోసం రూ.1,500 కోట్లు కేటాయించారు. ప్రారంభ దశలో లాభసాటిగా లేని ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించడం ఈ నిధి ఉద్దేశం. ప్రణాళిక, ఆమోదం, సేకరణ, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఈ పాలసీ కల్పిస్తుంది.
సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయాల ఆధారంగా ఈ పాలసీని రూపొందించినట్లు జీవోలో తెలిపారు. పీపీపీ కార్యకలాపాలకు సమన్వయ కేంద్రంగా, పైలట్ ప్రాజెక్టులకు ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేయడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. ఈ సెల్ ప్రభుత్వం, ఇతర శాఖలకు సలహాలు ఇవ్వడం, సదస్సులు, ఇన్వెస్టర్ల సమావేశాలు నిర్వహించడం, ఫిర్యాదుల పరిష్కారం, చట్టపరమైన నిబంధనల పరిధిలో ప్రాజెక్టులు ఉండేలా చూడటం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. రాయితీ ఒప్పందాలు, చట్టపరమైన పత్రాల సమీక్ష కూడా చేస్తుంది. ప్రతి శాఖలోనూ ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేస్తారు.
ఆరు పీపీపీ మోడళ్లు ఇవే:
బీవోటీ/డీబీఎఫ్‌ఓటీ: ఆదాయం తెచ్చిపెట్టే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు అనుకూలం. ప్రైవేట్ సంస్థ డిజైన్, నిధులు, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేసి, నిర్ణీత కాలం తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది.
టీవోటీ: ఇప్పటికే నడుస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ఆస్తుల ద్వారా ఆదాయం పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆస్తిని నిర్ణీత కాలం పాటు నిర్వహించే హక్కు కోసం ప్రైవేట్ సంస్థలు ముందస్తు ప్రీమియం చెల్లిస్తాయి.
బీవోటీ యాన్యుటీ/హైబ్రిడ్ యాన్యుటీ: వాణిజ్యపరంగా లాభసాటి కాని ప్రాజెక్టులకు అనుకూలం. పనితీరు ఆధారంగా ప్రభుత్వం వార్షిక వాయిదాలు చెల్లిస్తుంది.
బీఎల్‌టీ/ఆర్‌వోఎంటీ: వ్యూహాత్మక వసతులు, పాత ఆస్తుల ఆధునీకరణకు ఉపయోగపడుతుంది. నిర్మించి లీజుకు ఇవ్వడం లేదా ఉన్న ఆస్తులను పునరుద్ధరించి, నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి బదిలీ చేయడం వంటి రూపాలు ఉంటాయి.
లీజు/మేనేజ్‌మెంట్/సర్వీస్: ఎక్కువ పెట్టుబడి లేకుండా నిర్వహణ సామర్థ్యం పెంచాలనుకున్న ప్రాజెక్టులకు అనుకూలం. ప్రభుత్వ ఆస్తులు లేదా సేవలను ప్రైవేటు సంస్థ లీజు అద్దెకు నిర్వహిస్తుంది.
స్విస్ చాలెంజ్: కొత్త ఆలోచనలు లేదా మార్కెట్ ఆధారిత పెట్టుబడి అవసరమయ్యే ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టులకు అనుకూలం. ప్రైవేటు సంస్థ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి వేలానికి ఉంచుతుంది. వేరే వారు ఎక్కువ కోట్ చేసినా, మొదటి ప్రతిపాదకుడికి ఆ ధరతో మ్యాచ్ చేసి ప్రాజెక్టు పొందే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త విధానంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కాగలదని, ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.