Deputy CM Pawan Kalyan Suggests: ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న ‘స్వచ్ఛ రథాల’ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛ రథాల వద్ద పొడి వ్యర్థాలు అందించి, నిత్యావసరాలు తీసుకెళ్లే ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని సూచించారు.

అంతేగాక, తిరుపతి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన గ్రీన్‌ షాపుల విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆదేశించారు. ఈ షాపుల వద్ద కూడా పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలు తీసుకునే వ్యవస్థను ప్రజలకు విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేయాలని నిర్దేశించారు.

ఈనెలలో స్వచ్ఛ రథాల ద్వారా 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించినట్లు, దాని విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని పవన్‌ తెలిపారు.

సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌, స్థానిక సంస్థల అభివృద్ధి పనులను ప్రజలందరికీ పారదర్శకంగా తెలిసేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనుల వివరాలు ఈ డ్యాష్‌బోర్డులో అందుబాటులో ఉండాలని అన్నారు.

రోడ్ల పనులు చేపట్టేముందు కచ్చితమైన గడువు నిర్ణయించి, నాణ్యతలో ఎలాంటి రాజీకి తావు లేకుండా పూర్తి చేయాలని, నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, కమిషనర్‌ కృష్ణ తేజ్‌, ఈఎన్‌సీ బాలు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: