Tadipatri Peddareddy : సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట
తన నియోజకవర్గమైన తాడిపత్రికి వెళ్లడానికి పెద్దారెడ్డికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు;
తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దొరికింది. తన సొంత నియోజకవర్గమైన తాడిపత్రికి నిరభ్యంతరంగా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి లైన్ క్లియర్ అయినట్లైంది. తాడిపత్రి వెళ్లడానికి వీలు లేదంటూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తన నియోజకవర్గమైన తాడిపత్రికి వెళ్లడానికి తనను అనుమతించడం లేదని, తాను తన ఊరు వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ మాజీ శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన సొంత నియోజకవర్గం వెళ్లడానికి కూడా అనుమతించకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పెద్దారెడ్డి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. కేతిరెడ్డి పిటీషన్ని విచారించిన సుప్రీంకోర్టు మీ నియోజకవర్గం వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ ప్రశ్నించింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రి నిరభ్‌యంతరంగా వెళ్లవచ్చని పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవసరమైతే ప్రైవేటు సెక్యూరిటీ కూడా పెట్టుకుని పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సూచన చేసింది. పోలీసు సెక్యూరిటీకి అవసరమైన ఖర్చు పెద్దారెడ్డి భరించడానికి కేతిరెడ్డి తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్ధానం ముందు అంగీకరించారు.
గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు ఆయన్ను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా తీసుకువెళ్లి అనంతపురంలో వదిలిపెట్టి వస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్ల కారణంగానే తనను పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనకు తాడిపత్రి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం పెద్దారెడ్డని తాడిపత్రి రాకుండా నిరోధించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణలో పెద్దారెడ్డి వస్తే తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అనంతపురం ఎస్పీ వివరణ ఇచ్చారు. దీంతో హైకోర్టు సింగ్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసి విచారణను వాయిదా వేసింది. ఈ పిటీషన్ విచారణలో ఉండగానే కేతిరెడ్డిపెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రియించి భారీ ఊరట పొందారు.