Union Minister Pemmasani Chandrasekhar: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Union Minister Pemmasani Chandrasekhar: 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గ్రామాల అభివృద్ధి కీలకమని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలకు సేవలు చేరువులో ఉండాలని స్పష్టం చేశారు.
శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో సంవృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ సంవృద్ధి కేంద్రం గ్రామాల్లో డిజిటల్ సేవలు, పౌర సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. నారాకోడూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఇక్కడి నుంచి మోడల్‌గా అన్ని గ్రామాలకు విస్తరించాలని ఆలోచన.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘కేంద్రం ఒక్కటి... సేవలు అనేకం’ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటైందని తెలిపారు. గ్రామంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా ఈ కేంద్రంలో అన్ని సేవలు అందుతాయని, దాదాపు 60 రకాల టెస్టులు కేవలం 10 నిమిషాల్లో చేయవచ్చని వివరించారు. డ్వాక్రా మహిళలకు వ్యాపార నైపుణ్యాలు, పోస్టాఫీసు సేవలు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, రైతుల ఆదాయం పెంచడానికి భూమి సారత్వ పరీక్షలు, డ్రోన్ ద్వారా ఎరువులు చల్లడం వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంవృద్ధి కేంద్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, ఈ కేంద్రం ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్క చోట అనేక సేవలు అందించడం ద్వారా గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, పిల్లలు రోజుకు కనీసం ఒక గంట ఈ కేంద్రంలో గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వైఫై సౌకర్యం కల్పిస్తామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. “మాకు కులం లేదు, మా కులం ప్రజలకు సేవ చేయడమే” అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
ఈ సంవృద్ధి కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.