Inquiry into Adulterated Ghee in Srivari Laddus: శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ దర్యాప్తు ప్రారంభించింది. కమిషన్‌ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దినేష్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహానికి చేరుకుని క్షేత్రస్థాయి విచారణలో నిమగ్నమైంది.

తితిదేలోని సుమారు పది మంది విభాగాధిపతులతో ఉదయం 10:30 గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు దినేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. వైకాపా పాలనలో నెయ్యి టెండర్ల ఖరారు, నిబంధనల సడలింపు, నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు వంటి అన్ని అంశాలపై ఆయన ఆరా తీశారు. ముందస్తుగా సిద్ధం చేసిన సమగ్ర నోట్‌ను అధికారులకు అందజేస్తూ, ప్రతి అంశంపై పూర్తి వివరాలు, దస్తావేజులు సమర్పించాలని ఆదేశించారు. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను అత్యంత గోప్యంగా ఉంచాలని కూడా స్పష్టం చేశారు.

విచారణ సజావుగా సాగేందుకు పద్మావతి అతిథి గృహం ఎక్స్‌టెన్షన్‌ భవనం మొదటి అంతస్తును కమిషన్‌ కార్యాలయంగా ఖరారు చేశారు. ఇందులో ఛైర్మన్‌కు ప్రత్యేక గది, సిబ్బంది, కంప్యూటర్‌ సెక్షన్‌తో పాటు విచారణకు వచ్చే వారు వేచి ఉండేందుకు మొత్తం నాలుగు గదులు కేటాయించారు.

సాయంత్రం విజయవాడకు వెళ్లిన దినేష్‌కుమార్‌ మూడు-నాలుగు రోజుల్లో తిరిగి తిరుపతికి చేరుకోనున్నారు. ఈలోగా తాను కోరిన సమాచారం, రికార్డులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కల్తీ నెయ్యి అంశంలో జరిగిన అవకతవకలను పూర్తిగా నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు సిఫార్సు చేస్తూ 45 రోజుల్లోగా ఈ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Tags: