Pawan Kalyan: ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి: పవన్ కల్యాణ్ ఆదేశం

పవన్ కల్యాణ్ ఆదేశం

Update: 2026-06-08 14:57 GMT

Pawan Kalyan: గోదావరి నదిలో కాలుష్యానికి ప్రధాన కారకమైన ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు.

ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్య స్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత వచ్చిన నివేదికలపై రాజమహేంద్రవరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్షలో ప్రమాదకర రసాయనాలు నిర్దేశిత పరిమాణాల కంటే భారీ స్థాయిలో గోదావరిలో కలుస్తున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నెలకోసారి నమూనాలు సేకరిస్తున్నట్లు అధికారులు సమాధానం ఇవ్వగా, అలాంటప్పుడు ఇంత కాలుష్యం ఎందుకు అరికట్టలేదని అసహనం వ్యక్తం చేశారు.

వెంటనే ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే పర్యవేక్షణ సరిగా చేయని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News