Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు: హైకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ విచారణ

హైకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ విచారణ

Update: 2026-01-10 05:33 GMT

Jagan Disproportionate Assets Case: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేశామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైందని, దాని ఫలితంగా పలు కేసులు రిజిస్టర్ అయ్యాయని సీబీఐ వివరించింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో తాము దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం దాన్ని పరిగణనలోకి తీసుకుందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు.

దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో, జగన్ కంపెనీల్లో రూ.95 కోట్ల పెట్టుబడులు పెట్టినందుకు అక్రమ లీజులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టగా, సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయని, నిజమైన పెట్టుబడిదారులను గుర్తించి మినహాయించాలని న్యాయస్థానం సూచించిందని చెప్పారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై కేసులు రిజిస్టర్ అయ్యాయని వివరించారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, తాము కాగ్నిజెన్స్‌ను సవాలు చేయలేదని, దాల్మియా సిమెంట్స్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. హైకోర్టు సూచనలకు విరుద్ధంగా సీబీఐ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. గతంలో కొన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసినా, మరికొన్నింటిని అనుమతించినా, ఈ పిటిషన్‌లో వేరే అంశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పూర్తి వాదనల కోసం విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.

కడప జిల్లాలోని మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాల కోసం జయా మినరల్స్ దరఖాస్తు చేసింది. మూడు నెలల్లో ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ చేయాలన్న షరతుతో అప్పటి ప్రభుత్వం ఆమోదించిందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అదనపు కౌంటరు దాఖలు చేశామని చెప్పగా, క్రిమినల్ పిటిషన్‌లో కౌంటరు ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

సీబీఐ న్యాయవాది సమాధానమిస్తూ, గత బెంచ్ ఆదేశాలతో కౌంటరు దాఖలు చేశామని, పిటిషనర్ సమర్పించిన డాక్యుమెంట్లకు సమాధానం ఇవ్వడానికి అని వివరించారు. హైకోర్టు గతంలో ఇతర కేసుల్లో లేవనెత్తిన అంశాలను తేల్చివేసిందని గుర్తుచేశారు. సీబీఐ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించిందని అన్నారు.

Tags:    

Similar News