Ministers Nimmala Ramanaidu and Kandula Durgesh: చంద్రబాబు నాయుడు ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్‌ కాపులకు కేటాయించగా, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వాటిని రద్దు చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సచివాలయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తో కలిసి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ కింద 10% రిజర్వేషన్‌ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఎవరికీ ఇబ్బంది లేకుండా 5% కాపులకు కేటాయించారు. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక వెంటనే రద్దు చేశారు. వైకాపాలోని కాపు నాయకులు అప్పుడు ఎందుకు జగన్‌ను నిలదీయలేదు? చెంపదెబ్బలు తినాల్సి వస్తుందని భయపడ్డారా?” అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

వైకాపా నేరస్థుల కర్మాగారం:

వైకాపా నేరస్థులను తయారు చేసే కర్మాగారమని, తెదేపా నేతలను తయారు చేసే పార్టీ అని రామానాయుడు విమర్శించారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌ వంటి కాపు నేతలను రెచ్చగొట్టి నేరస్థులుగా మార్చి జైలు పంపిన జగన్‌ ఎజెండాను ఆయన ఎండగట్టారు. మరోవైపు చంద్రబాబు మెంటే పద్మనాభం, యర్రా నారాయణస్వామి, తోట సీతారామలక్ష్మి, వంగా గీత, సానా సతీష్‌ వంటి కాపు నాయకులను రాజ్యసభకు పంపి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు.

కాపు సంక్షేమ పథకాలు రద్దు:

పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో కాపు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిన చరిత్ర జగన్‌దేనని ధ్వజం ఎత్తారు. కాపు కార్పొరేషన్‌కు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంతమంది కాపు యువతకు విదేశీ విద్య సాయం చేశారో జగన్‌ చెప్పాలని సవాలు విసిరారు.

“జగన్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు ఎందరో కాపు యువకులు బలైపోయారు. గిద్దలూరు మండలం సింగంపల్లి కాపు యువకుడు బండ్ల వెంగయ్యనాయుడు రోడ్డు కోసం అడిగినందుకు వైకాపా ఎమ్మెల్యే, అనుచరులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు వైకాపా కాపు నాయకులు ఎక్కడ ఉన్నారు?” అని దుర్గేష్‌ నిలదీశారు.

గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను రాజకీయ లబ్ధి కోసం వైకాపా నేతలు కులాల పేరుతో సమావేశాలు నిర్వహించి విభజన తెస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కుల చట్రంలో బంధించాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Tags: