Deputy CM Pawan Kalyan: కాకినాడలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష – అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని, నీటి నిల్వలు లేకుండా డీవాటరింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పంటనష్టం అంచనాలు తక్షణం రూపొందించి నివేదిక ఇవ్వాలని, ఆస్తి నష్టం జరిగిన చోట పరిహారం అందించాలని కూడా చెప్పారు.
పిఠాపురం నియోజకవర్గంలో సుద్దగడ్డ వాగు ముంపు పరిస్థితి, ఉప్పాడ తీర ప్రాంత పరిస్థితులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. గడిచిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు, 15 ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలినట్లు కలెక్టర్ వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1,885 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలిసింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.