Kalichetti Appalanayudu Fire: కలిశెట్టి అప్పలనాయుడు ఫైర్: తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడైనా మునిగిందా? బెంగళూరు ప్యాలెస్‌లో కుట్రలు పన్నుతున్నారు జగన్!
బెంగళూరు ప్యాలెస్‌లో కుట్రలు పన్నుతున్నారు జగన్!
Kalichetti Appalanayudu Fire: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉందని, అది ఎప్పుడైనా మునిగిందా? అని ప్రశ్నిస్తూ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కుట్రలకు బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జగన్ పథకాలు రచిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఏం జరుగుతుందో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైకాపా ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆస్తులు గణనీయంగా పెరిగాయని, దేశవ్యాప్తంగా ఎంపీలు ఆశ్చర్యపోతున్నారని అప్పలనాయుడు విమర్శించారు. దోపిడీలు, భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపుల ద్వారానే ఇన్ని ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.
మరోవైపు రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా దొంగ సంతకాలతో జీతభత్యాలు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యలనైనా ప్రస్తావించాలని జగన్‌కు హితవు పలికారు.
మూడు రాజధానుల పేరిట జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ సహకారంతో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా నాయకులు దానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న 'అమరావతి అంటే జగన్‌కు ఇష్టమే' అనే వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న మహానగరాల గురించి ఒక వీడియో రూపొందించి బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌రెడ్డికి పంపుతానని కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు.