Kasibugga Road Accident Case: కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసు.. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు

ఆరవ్ లొంగుబాటు

Update: 2026-07-14 09:25 GMT

Kasibugga Road Accident Case: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గత శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి డి.దానయ్య (45) మృతికి కారణమైన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ప్రమాదం జరిగిన తర్వాత మొదట ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ్ అనే వ్యక్తి బాధ్యత వహిస్తూ పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీలు, పెట్రోల్ బంకు దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి బైక్ నడిపి ప్రమాదం చేసింది ఆరవ్‌యేనని నిర్ధారించారు.

ప్రమాదం జరిగిన రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆరవ్ ఒక్కడే పెట్రోల్ బంకుకు వెళ్లి బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నట్లు సీసీటీవీలు స్పష్టం చేశాయి. ప్రమాదం జరిగిన స్థలం బంకు నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందే ఆరవ్‌ను ఓ కారులో తరలించినట్లు కూడా ఆధారాలు బయటపడ్డాయి.

ఈ సంచలనాత్మక పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆరవ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరవ్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక చర్యలపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News