Kinjarapu Atchannaidu: దేశ ఆర్థిక బలానికి కార్మికులు, రైతులే ఆధారం: అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు

Update: 2026-05-01 11:00 GMT

Kinjarapu Atchannaidu: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కార్మికులు, కర్షకులు ప్రధాన ఆధారమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మే డే సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలు, నిర్మాణ రంగం, సేవారంగం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ శ్రమజీవుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

దేశాభివృద్ధి కేవలం పెట్టుబడులు, యంత్రాలు, విధానాలతోనే సాధ్యం కాదని, వాటికి ప్రాణం పోసేది కార్మికుల చెమట, రైతుల కృషి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆహార భద్రతను కాపాడే రైతు, ఉత్పత్తి చక్రాన్ని నడిపే కార్మికుడు సమాజ పురోగతికి రెండు బలమైన స్తంభాలవంటి వారని అన్నారు.

ప్రతి రోజూ తమ శ్రమతో కుటుంబాలనే కాకుండా రాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న కార్మికులను గౌరవించడం అందరి బాధ్యతని మంత్రి పేర్కొన్నారు. వారి సంక్షేమం, భద్రత, జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

మే డే స్ఫూర్తి శ్రమకు గౌరవం ఇవ్వడమేనని అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మికుల హక్కులు పరిరక్షించబడినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్మికులు, కర్షకుల కృషికి తగిన గుర్తింపు లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News