Kotamreddy Sridhar Reddy: వైఎస్ జగన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Update: 2026-07-07 12:08 GMT

Kotamreddy Sridhar Reddy: హిందూ మఠాధిపతులు, పూజారులు, సాధుసంతులను అగౌరవంగా తిట్టిన యూట్యూబర్ రావణ్ జోసెఫ్‌ (జోసెఫ్ రావణ్)కు మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్రంగా నిలదీస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరులోని ఒక హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, మఠాధిపతులను అవమానించిన రావణ్ జోసెఫ్‌పై కేసు నమోదు చేసి న్యాయస్థానం రిమాండ్‌కు పంపించింది. కేసులో బలం ఉంది కాబట్టే ఆ చర్య తీసుకున్నారు. కానీ జగన్ ఆ వ్యక్తిని సమర్థించడం దుర్మార్గం” అని ఆరోపించారు.

ఆయన మరింత వివరిస్తూ, “దేశభక్తి లేదని జోసెఫ్ స్వయంగా చెబుతుంటే కూడా జగన్ ఆయన వైఖరిని సమర్థిస్తున్నారా? ఇది దేశ ప్రజలను అవమానించడం. హిందూ మత విశ్వాసాలపై దాడి చేసిన వ్యక్తులు రేపు ఇతర మతాలపై కూడా దాడి చేయకపోతే గ్యారంటీ ఏమిటి? ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మద్దతు ఇచ్చిన జగన్ యావత్ దేశ ప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా అధినేత వైఖరిని తీవ్రంగా ఖండించారు. “హిందూ సంప్రదాయాలను గౌరవించని వైఖరి వైసీపీ నేతల్లో ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది” అని విమర్శించారు.

ఈ ప్రెస్ మీట్‌లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావణ్ జోసెఫ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రతిధ్వని చేస్తున్నాయి.

నేపథ్యం: యూట్యూబర్ రావణ్ జోసెఫ్ హిందూ దేవుళ్లు, మఠాధిపతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో పలువురు ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలు పంపించారు. ఈ విషయంపై వైఎస్ జగన్ స్పందించిన తీరును టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News