కుప్పం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీదే
కుప్పంలో కృష్ణమ్మకు జల హారతి సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు;
పార్టీ స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తెలుగుదేశం పార్టీనే గెలిపించిన కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం ఆయన కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా సీయం చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం నూటికి 80 శాతం ఓట్లు తెలుగుదేశానివే అని చెప్పారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని, ఇక్కడ రప్పా రప్పా రాజకీయం చేయాలనుకున్నారని, కానీ పులివెందుల, ఒంటిమిట్లల్లో రప్పా రప్పా రాజకీయం అంటే ఏమిటో అక్కడి ప్రజలు చూపించారని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ ఒక విషవృక్షమని రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. మేము అభివృద్ధి యజ్ఞం చేపడుతుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో రాయలసీమలో వైసీపీని 7 సీట్లకే పరిమితం చేశారని అయినా వారు మారలేదన్నారు. ఇరిగేషన్, హర్టీకల్చర్, అగ్రికల్చర్, పారిశ్రమిక రంగాల్లో సీమను అభివృద్ది చేస్తామని సీయం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, మెగా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేస్తున్నామని, కుప్పం నుంచి కూడా 50 మంది టీచర్లుగా ఎంపికయ్యారని సీయం తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి ఒకప్పుడు టీచర్లు వచ్చేవారు కాదని, బదిలీలు చేయించుకు వెళ్లిపోయేవారని చంద్రబాబు గతాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కుప్పం యువతీ, యువకులే టీచర్లు అయ్యారన్నారు. స్త్రీశక్తి వల్ల ఆటో డ్రైవర్లకు ఎలాంటి నష్టం రాదన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇది అందరి ప్రభుత్వమని ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా చూస్తామని సీయం హామీ ఇచ్చారు. కుప్పంలో 12 పరిశ్రమలు వచ్చాయని చెప్పిన చంద్రబాబు రూ.3,908 కోట్లు పెట్టుబడులు, 15600 మందికి ఉద్యోగాలు, 26581 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని వివరించారు. ఐ-ఫోన్ ఛాసెస్ ఉత్పత్తి చేసేలా హిందాల్కో సంస్థ యూనిట్టును ప్రారంభించబోతోందని తెలిపారు. కుప్పాన్ని ఇతర రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున రహదారులు నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీనంతా కుప్పానికి తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.